Tuesday, July 16, 2019

పల్లె గొల్లుమన్నది తన గోడుచెప్పుకున్నది
వాడ వాడ నడయాడు జనమే లేదన్నది
ప్రేమతోటి పలకరించు నరుడే లేడన్నది
ఆప్యాయత చిలకరించు ఎదనే లేదన్నది

1.సందెల కడ అంబలితో సంబరమేదన్నది
గట్కకూ గంజికీ జాడలెరుగ నన్నది
చేసుకున్న కూరల అదల్బదలు ఏదన్నది
బుక్కెడంత తినిపొమ్మను కొసరుడెక్కడన్నది
కడుపారా వడ్డించెడి మమతే లేదన్నది

2.కచ్చరాల మాటేమో ఎద్దుజాతి ఏదన్నది
సవారి బండ్ల పైనం మచ్చుకైన లేదన్నది
గోచికట్టు చీరలతో పడుచందం ఏదన్నది
మాయదారి నాగరికత తనమనుగడ కీడన్నది
పండగొస్తె మాత్రమే యాదికొస్తె ఎట్లన్నది

3.పొలాలు మేడలైతే కూడుకేది గతియన్నది
రైతే ఇక మాయమైతె బ్రతుక్కు చేటన్నది
పచ్చదనం తరిగిపోతె ప్రకృతి విలయమన్నది
వ్యవసాయం కుంటుబడితె సంకటమేనన్నది
పల్లెకు బలమీయకుంటె మనిషికి ముప్పన్నది

No comments: