Saturday, July 13, 2019

మనసుకు మెదడుకు ముడిపడదెన్నడు
మమతా నియతీ జత పడవెప్పుడు
అవధులేలేనిది అనురాగము
పరిధిమించనీయదు అధికారము

1.తర్కాలు రచియిస్తుంది వాదనలు నిర్మిస్తుంది
గెలుపుకోసమే ఎపుడు మేధ కృషిసల్పుతుంది
లాభాలునష్టాలు బేరీజువేస్తుంది
ఆచితూచి అడుగేస్తూ జాగ్రత్తపడుతుంది

మూర్ఖంగ స్పందిస్తుంది మౌనంగ రోదిస్తుంది
తనదృష్టికోణంలోనే ప్రపంచాన్నిచూస్తుంది
అనుచితాలు ఉచితాలు పట్టించుకోదు హృదయం
బంధాల ఆరాటంలో తాను బలియౌతుంది

2.ఋజువులే కోరుతుంది  వాస్తవాల్నె నమ్ముతుంది
ఆచరణ సాధ్యాలనే అమలుపరచబూనుతుంది
ఎదరొదను ఏమాత్రం బుద్ధి లెఖ్ఖచేయదు
లక్ష్యాన్ని సాధించుటలో విలువలకూ విలువీయదు

కలలెన్నొ కంటుంది కల్పనలో బ్రతికేస్తుంది
అనిర్వచనీయమైన అనుభూతికి లోనౌతుంది
మేధస్సు బోధలను మది ఖాతరె చేయదు
మానవీయనైజాన్ని మాటవరుసకైన మరువదు

No comments: