Saturday, August 24, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మధ్యమావతి

కాలరుద్రుడా వీరభద్రుడా
కన్ను తెరవరా ఇకనైనా
గరళకంఠుడా హే నటేశుడా
తాండవించరా ఇపుడైనా
ఘోరకలికి తెఱదించు
నేరవృత్తినే తెగటార్చు
పునఃసృష్టియే జరుగునట్లుగా
విశ్వ లయమునే గావించు
మానవత్వమును స్థాపించు

1.అత్యాచారము మా గ్రహచారం
అతివకు లేదిట అభయము
విలువలు మరచిన మా సమాజం
విశృంఖలతయే మా నైజం
కాల భైరవా భూతనాయకా
అవధరించరా ఇకనైనా
విరూపాక్షుడా విశ్వనాథుడా
నిదుర లేవరా ఇపుడైనా

2.అవినీతియే  మాకతి సామాన్యం
జనజాగృతియే ఇట కడు శూన్యం
మోసగించడం మా మనస్తత్వం
హింసించడం మా కానందకృత్యం
జ్వాలనేత్రుడా శూలహస్తుడా
ఆగ్రహించరా ఇకనైనా
వైద్య నాథుడా మృత్యుంజయుడా
అనుగ్రహించరా ఇపుడైనా

No comments: