Sunday, August 11, 2019

ఇల్లరికపుటల్లుళ్ళ వైభోగము
వింత ఏముంటుంది మామ ఇంట మకాము
ఒకరేమో జగన్నాథుడు మరొకరేమో విశ్వనాథుడు
ఒకరేమో శ్రీనివాసుడు మరొకరోమో అర్ధనారీశ్వడు

1.జలధిజ విభుడు జన్మరాహిత్య వరదుడు
కరుణాసాగరుడు సాగర శయనుడు
లోకపాలకుడు అలౌకికానందకారకుడు
అమందానంద కందళిత హృదయారవిందుడు గోవిందుడు

గిరిజావల్లభుడు కైవల్యదాయకుడు
పరమదయా హృదయుడు హిమవన్నగ వాసుడు
సకలలోకేశ్వరుడు సచ్చిదానందయోగిపుంగవుడు
నిత్యనిరంజన నిర్వికల్ప సంకల్పుడు శివశంకరుడు
జనార్ధనుడొకరు జంగమ దేవర ఒకరు
రమేశ్వరుడొకరు పరమేశ్వరుడొకరు

2.కపటనాటక సూత్రధారి గిరిధారి మురారి
దశావతారధారి  దనుజారి శ్రీ హరి
కరి ప్రాణ సంరక్షక  చక్రధారి గరుడవాహన శౌరి
భక్తమానస విహారీ భవ రోగ హారీ

కాలకాలుడు నీలకంఠుడు నేత్రత్రయుడు నర్తన ప్రియుడు
జంగమవేషధారి వృషభవాహన సంచారి పురహరి
మార్కండేయ ఆయుఃప్రసాది త్రిశూలధారీ
 భోలానాథ మదనారి త్రిగుణాతీత జటధారీ
నాగ తల్పుడొకరు నాగభూషణుడొకరు
పీతాంబరుడొకరు చర్మాంబరుడొకరు



No comments: