Wednesday, September 4, 2019

https://youtu.be/bRadpeWtUQg

దశవిధ అవతార దనుజ వైరి
నిజభక్త పాలా నిర్గుణాకారా
నిను కీర్తి పొగడగ శేషుడె అలసే
నిరతము నుతియించ నారదుడే మైమరచె

1.వేదనిధిని సంరక్షింప సోమకు దునిమిన
మత్స్యావతార ప్రణమామ్యహం
సుధకై మధింప మంధర గిరినిల్పిన
కూర్మావతార ముకుళిత కరవందనం
దానవాగ్రణి బలి పీచమణిచిన
వామన స్వరూపా వినమ్ర నమసము
బ్రహ్మవరదర్పి హిరణ్యాక్షుగూల్చిన
వరాహమూర్తి అభివందనం
ప్రహ్లాదుగావగ హిరణ్య కశిపుని
సంహరించిన నరసింహా నమోవాకము

2.పరశువునే చేబూని క్షత్రియులను ఖండించిన
భార్గవరామానీకు బహువిధముల వందనం
రావణాంతక రఘుకుల తిలక సీతాపతీ
శ్రీరామచంద్ర నీకు శిరసావందనం
జీవనసారమైన గీతను బోధించిన
కృష్ణా జనార్ధనా సాష్టాంగ వందనం
ధర్మము సంఘము శరణమ్మని చాటినా
బుద్ధావతార నీకు పాదాభివందనం
అశ్వారూఢుడవై ఖడ్గధారుడవై ఆకలి
నెడబాపెడి కల్క్యావతార నీకు కైలాటము

No comments: