Friday, September 20, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

బియ్యము మెతుకయ్యే క్షణమది ఏదో
పాలుతోడి పెరుగయ్యే ఆ నిమిషమేదో
కణసంయోగమెపుడు శిశువయ్యేనో
జీవుడెపుడు వీడితనువు శవమయ్యేనో
అంతుపట్టలేనిదా దైవ రహస్యం
అంతరార్థమేమిటో అగమ్య గోచరం

1.గొంగళిపురుగు సీతాకోక చిలుకయ్యే వైనమేమిటో
రంగుల ఇంద్రధనుసు సృజన చాతుర్యమేమిటో
గిజిగాడి గూటి నిర్మాణ నైపుణ్యమెవరు నేర్పిరో
ఊసరవెల్లికి వర్ణ వితరణెవరు చేతురో
అంతుపట్టలేనిదా దైవ రహస్యం
అంతరార్థమేమిటో అగమ్య గోచరం

2.ఆహార నిద్రా భయ మైథునాలనేర్పచిన దెవ్వరో
 చేపలకు పక్షులకు ఈదనెగుర శిక్షణ నెవరిచ్చిరో
ఖగనాగుల నడుమన పగనెవ్వరు కలిపించిరో
వేటాడగ మృగరాజుకు పాటవమును కూర్చిరెవరొ
అంతుపట్టలేనిదా దైవ రహస్యం
అంతరార్థమేమిటో అగమ్య గోచరం

No comments: