Sunday, October 20, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:సామ

అర్చించెదనయ్యా నిన్నూ అనంత శయనా
సమర్పించెదనయ్యా నన్నూ అరవింద లోచనా
కోట్లాది భక్తులకూ కొంగు బంగారమయ్యీ
దివారాత్రాలు నిల్చీ కాళ్ళనొప్పులయ్యీ
ఆదమరచి నిదురోయావో ఆనంద నిలయా
సతులిద్దరు సేవించగా సేదతీరుతున్నావో దయామృత హృదయా

1.చమరించిన నా నయనాల ఆహ్వాన ఆసనాలు
ఒలుకుతున్న ఈ కన్నీరే అర్ఘ్య పాద్య ఆచమనాలు
నిరతమునీ తలపుల స్వేదం నిత్యాభిషేకము
నా చూపుల వస్త్రాలే నీకు పీతాంబరాలు
ఉన్నవాటితోనె నిన్ను ఉన్నతంగ పూజించేను
పుష్కలంగ కలిగినవన్నీ నీకు ధారపోసేను

2.రోగాలు నొప్పులపూలతొ ఆష్టోత్తరమొనరించేను
 కష్టాలు వేదనల ధూపదీపాలు పెట్టెదను
నా ఈతిబాధలనే  స్వామీ హారతిగా పట్టెదను
బ్రతుకె నీకు నైవేద్యం తిరుపతి బాలాజీ గైకొను
ఉన్నవాటితోనె నిన్ను ఉన్నతంగ పూజించేను
పుష్కలంగ కలిగినవన్నీ నీకు ధారపోసేను





No comments: