Sunday, October 20, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎందులో దాగుందో అందం-ఎందరికి తెలుసు
అందమంటే తగు అర్థమేంటో-ఎరుగునది ఒకటే మనసు
కళ్ళలోనా చూసే కళ్ళలోనా-పడతిలోనా  పచ్చనీ ప్రకృతిలోనా
ఎక్కడని లేదు అందం-అంతటా ఆహ్లాదం
అభివ్యక్తం చేయలేనిది-అనుభూతికె అవగతమైనది

1.కొండలూ కోనల్లో-జలపాత హోరుల్లో
ఆరారు ఋతువుల్లో -కెరటాల నురగల్లో
తొలి ఉషస్సు వెలుగుల్లో-నిశీథినీ తారల్లో
దట్టమైన అడవుల్లో -ప్రశాంత సరోవరాల్లో
ఎక్కడని లేదు అందం-అంతటా ఆహ్లాదం
అభివ్యక్తం చేయలేనిది-అనుభూతికె అవగతమైనది

2.వనిత వదనంలో-నాతి నయనంలో
నారీమణినాసికలో-అతివ అధరంలో
ప్రమద పయ్యెదలో-ముదిత వాల్జడలో
కోమలి నడుములోనా-జాణ జఘనములోనా
ఎక్కడని లేదు అందం-అంతటా ఆహ్లాదం
అభివ్యక్తం చేయలేనిది-అనుభూతికె అవగతమైనది

3.భౌతికమైన అందం కొంతకాలముంటుంది
అలంకరణ ఉంటె మాత్రమే ఆకట్టుకొంటుంది
మది చూరగొనుటే అందమైతే
మంచితనం మించునదేది
దృష్టి కేంద్ర బిందువంద మంటే
సేవదృక్పథమే స్ఫూర్తి ఔతుంది
మానవత్వం కన్నా గొప్పగ సౌందర్యముంటుందా
ప్రేమతత్వం కన్నా మిన్నగ శోభిల్లుతుందా

No comments: