Wednesday, October 2, 2019


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:నాటరాగం

సత్యవ్రత దీక్షాపరుడు-అపర హరిశ్చంద్రుడు
ధర్మాచరణలో రఘుపతి రాఘవ రాజా రాముడు
అహింసా పాలనలో గౌతమబుద్ధుడు
ఆయుధమే ధరించని అని అభినవ కృష్ణుడు
గాంధీమహాత్ముడు భరతజాతి గర్వకారణుడు

1.నల్లజాతివారికి అండదండ అయినాడు
తెల్లవాడి గుండెల్లో సింహస్వప్న మైనాడు
పరమతసహనాన్ని పాటింపజేసినాడు
తరాలెన్ని మారినా తరగని చెరగని ముద్రవేసినాడు
గాంధీమహాత్ముడు భరతజాతి గర్వకారణుడు

2.నభూతోన భవిష్యతి జాతిపితా బాపూజీ
సంకల్పసాధనలో ఎన్నడెరుగలేదు రాజీ
స్వరాజ్య లక్ష్యమే ఊపిరిగా సాగించెను ఉద్యమం
పరపాలన తుదముట్టించెను అస్త్రమై సత్యాగ్రహం
గాంధీమహాత్ముడు భరతజాతి గర్వకారణుడు

3.ఆడంబరాలకు ఆమడదూరం కొల్లాయిధారణ
ఆభిజాత్యానికి తిరస్కారం గాంధీజీ ఆచరణ
నరజాతి చూడలేదు ఇటువంటి పుంగవుని
మూర్తీభవించిన అనుపమాన మానవతావాదిని
గాంధీమహాత్ముడు భరతజాతి గర్వకారణుడు

No comments: