Monday, July 15, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నా జీవితమొకవైపు
నా తనయుడి మనుగడ ఒకవైపు
బదులుగా ఏదైనా నానుండి తీసుకో
నా సుతుని భారమింక నువు చూసుకో
ఓ విశ్వకవి మిత్రుడా ఓ విచిత్ర చిత్రకారుడా

1.జన్మలే దాటివచ్చే కర్మలను పరిమార్చు
ఈజన్మలొ చేసినట్టి దోషాల తెగటార్చు
అనుభవించితీరాలంటే ఖాతాను నాకు మార్చు
శిక్షనే ఖరారు చేస్తే అది నాకే జతకూర్చు
ఓ న్యాయమూర్తీ విశ్వచక్రవర్తీ

2.ఇంద్రియాలు నీవశమై ఇకనైనా సాగనీ
నీ ఇంద్రజాలాలు మాపైన  ఇపుడైనా ఆగనీ
ఆడిఆడిమేమెంతో అలసిపోయనాము స్వామీ
విసుగూ విరామమే నాకథలో లేదా ఏమీ
నటన సూత్రధారీ ఓ ధర్మాధికారీ

3.దారి తప్పువేళలో నీదరికి మము జేర్చు
మాచీకటి బ్రతుకుల్లో వెలుగుపూలు పూయించు
మానవతా విలువలను మనిషిమనిషిలోన పెంచు
ప్రేమానురాగాలు మాకింక బోధించు
ఓ సద్గురునాథా జగద్గురుదేవా

No comments: