Tuesday, January 7, 2020

ఎముకలు కొరికే చలిలో హిమగిరి చరియల కొనలో
నరమానవుడి జాడేలేని మంచుగడ్డలలో
వడగాలలు చెలరేగే వేసవి ఎడారుల్లో
పహారాయే కర్తవ్యంగా సరిహద్దు రక్షణే ధ్యేయంగా
బ్రతుకేధారపోసే సైనికులారా మీకు సలాం
ప్రాణం ఫణంగపెట్టే ప్రియ సిపాయిలారా మీకు గులాం

దుప్పటిమాటున ఒదిగి చెలి కౌగిలిలోన కరిగి
నేను నాదను వాదనతో సుఖాలనెన్నొ మరిగి
నీ త్యాగం విలువనెరుగక పౌరులమంత చెలఁగి
నీ సేవానిరతిని  గుర్తించలేక స్వార్థంతో మేమే ఎదిగి
విర్రవీగిపోతున్నాము నిన్ను మరచి పోతున్నాము
బ్రతుకేధారపోసే సైనికులారా మీకు సలాం
ప్రాణం ఫణంగపెట్టే ప్రియ సిపాయిలారా మీకు గులాం

ఎండనకా వాననకా రేయనకా పగలనకా
నేలతల్లి ప్రాణంగా నింగి తండ్రి దేహంగా
కరువూ కాటకాలకెన్నడూ వెన్నిడక
పంటలెన్నొ పండించి ధాన్యమునే అందించి
పదిమంది కడుపు నింప పాటు పడే రైతులార మీకు సలాం
అభినవ కర్ణులార మా అన్నదాతలార మీకు గులాం

కాలికి ధూళంట నీక మట్టిమాటనే గిట్టక
డబ్బులుంటె కడుపునిండు ననే భ్రమలు వీడక
కిసానంటె ఎప్పటికి చిన్నచూపుతో పలుక
పల్లెపట్టు రైతునెపుడు పట్టించుకోక
నగరాలలో మేము నాగరికతనొదిలేము
పదిమంది కడుపు నింప పాటు పడే రైతులార మీకు సలాం
అభినవ కర్ణులార మా అన్నదాతలార మీకు గులాం






No comments: