Sunday, February 9, 2020

మూడు జగములన్నిటికీ మూలపుటమ్మా
ముగ్గురమ్మలనే గన్న చానా పెద్దమ్మా
సింగమునెక్కి ఊరేగే దుర్గాంబా మహంకాళికాంబా
లోకములన్నీ మోకరిల్లే శాకంబరి శాంభవీ జగదాంబా
వందనాలు లాల్ దర్వాజా సింహవాహినీ
అందుకోవమ్మా బోనాలు కాళికా భవానీ
జయహో శాకంబరీ జై మహంకాళీ
జయహో సింహవాహినీ జయహో దుష్టనాశినీ

1.పోతరాజు వెంటనుండ సాగేను జాతర
దుర్మార్గులనందరినీ  వేసేయవె పాతర
ఆడపడచుగానూ నిన్నాదరణ చేసేము
ఆషాఢమాసాన నిను ఆహ్వానించ వచ్చాము
ఆదరించవమ్మా మము నిండు మనసుతోనూ
మము చల్లగ జూడవమ్మ ప్రేమ మీరగానూ
జయహో శాకంబరీ జై మహంకాళీ
జయహో సింహవాహినీ జయహో దుష్టనాశినీ

2.మహిషాసుర రక్కసున్ని కర్కశంగ దునిమావే
మధుకైటభులనూ మదమణచగ చంపినావె
నిశుంభునీ శుంభునీ సంహరించి వేసావే
కలిలోని కీచకులను పీచమణచ వేలనూ
నీ ప్రియమగు బోనాలు  మోసుకొచ్చామే
ఆరగించి అర్తి తీర్చి దీన జనుల కావవే
జయహో శాకంబరీ జై మహంకాళీ
జయహో సింహవాహినీ జయహో దుష్టనాశినీ

No comments: