Tuesday, February 18, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:సారమతి

ఏమిటి నీమాయ-మా కన్నులు మూయ-అమ్మా అమృత హృదయ
గజిబిజి మాకేలా- తికమక లివియేల- జననీ నీ లీలా
నిను తెలియగ మేమెన్ని -ఎత్తాలో జన్మల్ని
నిను అరయగ మేమెన్ని చేయాలో తపములని
శ్రీ చక్ర సింహాసినీ శ్రీ లలితే జగన్మోహినీ  నమో మోక్షదాయినీ

1.జననాలు మరణాలు సంక్లిష్ట జీవనాలు  నీకేళీవిలాసాలు
ఖేదాలు మోదాలు నాదేయనువాదాలు నీ క్రీడా వినోదాలు
ప్రేమలు పెళ్ళిళ్ళు ఈ గందర గోళాలు నీ లీలా విశేషాలు
ఈ నాటకరంగానికి తెఱదించవె ఇకనైనా
నీపద సదనానికి మముచేర్చవె ఇపుడైనా
శ్రీ చక్ర సింహాసినీ శ్రీ లలితే జగన్మోహినీ  నమో మోక్షదాయినీ

2.ఈ భవబంధాలు తనపర భేదాలు ఛేదించగ దయగనవే
ఈ రాగద్వేషాలు  ఈ మోహపాశాలు తొలగించి వేయవే
అజ్ఞానకృత దోషాలు అహంభావ వేషాలు పరిమార్చవే
ఆత్మదేహ భావననిక అవగతమొనరించవే
విశ్వైక్య మొందించగ అవనతమొందించవే
శ్రీ చక్ర సింహాసినీ శ్రీ లలితే జగన్మోహినీ  నమో మోక్షదాయినీ

No comments: