Thursday, March 12, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

విపత్తులేం కొత్తకాదు మానవాళికీ
ప్రకృతికి ఎదురీత అనాదిగా ఆనవాయితీ
బ్రతుకడమంటేనే నిత్యం సంస్ఫోటం
మనుగడ కోసం తప్పదెపుడు పోరాటం
చచ్చేవరకు జీవించాలి-చావుమిష ను చంపేయాలి
మానవలోకాన్నే స్వర్గతుల్యం చేయాలి

1.టర్నడోలు త్సునామీలు భువి ఎన్ని చూడలేదు
భూకంపాలు జలప్రళయాలెన్ననుభవించలేదు
బెదిరినంతసేపు మ్రింగచూచు ప్రతి సమస్య
ఎదిరించబూనితే తోకముడుచు పురుగు పుట్ర
బెంబేలు పడిపోతే ఉన్నమతి చెడిపోతుంది
జాగరూకులైతేసరి కరోనా కనుమరుగౌతుంది

2.ప్లేగు మశూచి వ్యాధుల మట్టుబెట్టలేదా
క్షయ కలరాలను కట్టడే సేయలేదా
జగమొండి రోగాలకు టీకా కనిపెట్టలేదా
నిరంతరం శోధిస్తూ చికిత్సలే చేపట్టలేదా
ప్రభుత్వ సూచనలన్నీ తు.చ తప్పక పాటించాలి
పాలనా యంత్రాంగానికి సహకరించి తీరాలి

3.నిర్లక్ష్యమె మూలకారణం అన్ని విలయాలకు
స్వయంకృతాపరాధాలే సకల జాడ్యాలకు
పరిశుభ్రత పాటించగలిగితే  పరమ ఔషధమౌతుంది
స్వఛ్ఛదనం పచ్చదనం మనిషికి సంజీవనౌతుంది
ఇంటిపట్టున ఉంటేచాలు కరోనా నరికట్టవచ్చు
మనుషులు తగు ఎడముంటే కరోనాఆట కట్టించవచ్చు

No comments: