Saturday, June 13, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:శుభాళి

తిట్టితిని మరి మరి గీపెట్టితిని
గొంతెమ్మకోర్కెలకై నే పట్టుబట్టితిని
తిరుమలేశ  నీ పాదాలా తలపెట్టితిని
ఎట్టకేలకు నీ  కావ్యగీతి  తలపెట్టితిని

1.ఒళ్ళుజలదరించేలా నీళ్ళుకుమ్మరించితిని
అభిషేకమేదో అయ్యిందనిపించితిని
తొడిమలైన తీయకుండా పూలన్ని చల్లితిని
వక్షానికి గుచ్చుకున్నా పూజపూర్తి చేసితిని
ఆరాధన పేరిట అపరాధమొనరించితిని
అహంభావినై నీకడ నే ప్రవర్తించితిని

2. ఓరిమిగా మనలేకా నిన్ను నిగ్రహించితిని
బాధ్యతనే విడినాడి నేనాగ్రహించితిని
అనుభవాల సారమంతా నే సంగ్రహించితిని
కర్తా కర్మా క్రియనీవేనని ఇపుడే గ్రహించితిని
ఫలితమేదైనా నే పరిగ్రహించితిని
బ్రతుకునీ  ప్రసాదమనీ ప్రతిగ్రహించితిని

*ఇక నేనాగలేకా చేరితిని తిరుపతిని
శ్రీవేంకటేశ్వరా కనులారనిన్ను దర్శించితిని
నే తరియించితిని*

No comments: