Thursday, September 3, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పాలకడలి చిలికినపుడు పుట్టావో
పరమశివుడి ఆనతితో నా జత కట్టావో
స్రష్టసృష్టి ఎరుగని సౌందర్యం నీవో
జగన్మోహిని  దివ్య అవతారానివో
దివిజగంగ పావన సలిలం నువ్వు
బహుజన్మల నా తపఃఫలం నువ్వు

1.గరళం మ్రింగినందుకు ప్రతిగా
నిను పొందె భవుడు వేల్పుల బహుమతిగా
ఇరువురి ఇంతులతోనే వేగని ఈశ్వరుడు
నా మీది ప్రేమతో నిను ముడిపెట్టాడు
చంద్ర కిరణ శీతల అనిలం నువ్వు
బహుజన్మల నా తపఃఫలం నువ్వు

2.కాలకూట విషం మినహా
క్షీరాంబుధి జనిత అద్భుతాల సహా
కలబోసి కూర్చిన అతిలోక సుందరి నువ్వు
నభూతోనభవిష్యతి నీ చిరునవ్వు
నవపారిజాత పరిమళం నువ్వు
బహుజన్మల నా తపఃఫలం నువ్వు

No comments: