Monday, March 15, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అలసట తొలగించే మలయ పవన అనుభూతి

అలకను మానిపించె అనునయ స్పర్శరీతి

ఆహ్లాదం ప్రసరించే పూర్ణేందు మాలతి

ఉల్లాసం కలిగించే సమ్మోహన స్నేహగీతి

నీ ముఖమే అపూర్వ దివ్య బ్రహ్మ కమలం

ఇందిందిరమై గ్రోలెద పుష్కల పుష్ప మరందం


1.ప్రత్యూష కిరణాల హాయిగొలుపు వెచ్చదనం

చిన్ననాటి అమ్మచేతి గోరుముద్ద కమ్మదనం

తొలిప్రేమ ప్రియురాలి అధరాల తీయదనం

పారమార్థ సాధకమౌ ప్రశాంతధ్యానసదనం

అలౌకికానంద దాయకం నీ దివ్య వదనం

వీక్షణ మాత్రాన ధన్యం అనన్యం నా జీవనం


2.నడివేసవి పగటి పూట దాహార్తికి చలివేద్రం

నిశ్చలమౌ నిర్మలమౌ పావనమౌ పాల సంద్రం

కవిగాయక ఉత్ప్రేరక నిత్య పరమ మంత్రం

ఆహారనిద్రా అవ్యయాన్వయ ఏకైక సూత్రం

సౌందర్య లహరియై ఒప్పారెడు నీ ఆననం

పరవశమే కలిగించెడి అద్భుతమౌ ఇంధనం

No comments: