రచన, స్వరకల్పన&గానం:డా.రాఖీ
(నేటి {10th MAY}మా వివాహ 31 వ వార్షికోత్సవం సందర్భంగా నా ప్రియమైన శ్రీమతి 'గీత'కు ప్రేమకానుక)
భార్యకు సరియైన పర్యాయపదమీవే
దేవేరికి ఉచితమైన నిర్వచనం నీవే
అర్ధాంగికి అసలైన అర్థమూ నీవె
ఇల్లాలుకు ఇంపైన రూపకమూ నీవే
ఓ చంద్రముఖీ నా ప్రాణసఖీ నా భాగ్యమీవే
ఓ చామంతీ నా దమయంతీ నా బ్రతుకు నీవే
1.నీ గొప్పతనమేలే నను భరించడం
ఘనమైన నీగుణమేలే నను సహించడం
క్షణమైన నువులేక యుగమౌ నిరీక్షణం
నీతో దాంపత్యం నిత్యనూతనం విలక్షణం
ఓ చంద్రముఖీ నా ప్రాణసఖీ నా భాగ్యమీవే
ఓ చామంతీ నా దమయంతీ నా బ్రతుకు నీవే
2.సీత సైతం దాటలేని నాపాలిటి గీతనీవే
జీవితగతికే ప్రగతిని కూర్చే కృష్ణ గీతనీవే
ఏడేడు జన్మలకు విధిలిఖిత నా నుదుటిగీతవే
నా కలం ఆలపించే ప్రతి మధుర గీతమీవే
ఓ చంద్రముఖీ నా ప్రాణసఖీ నా భాగ్యమీవే
ఓ చామంతీ నా దమయంతీ నా బ్రతుకు నీవే
No comments:
Post a Comment