Sunday, May 23, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గులాబీల రెక్కలన్ని ముద్దగ చేసి

మంచిగంధమ్మునే మిళితంచేసి

తేనెలో సుధలోను రంగరించి

వెన్ననూ వెన్నెలను జతగజేసి

సృష్టించాడు అపూర్వంగ నిన్ను విరించి

తలవంచాడు నీకన్న అందాలను సృజించడం మరచి


1.భువికి రాగ జంకే రంభకూ ఊర్వశికి

పున్నమైన తడబాటే నిను గని శశికి

దమయంతికి చింతనే నీతో పందానికి

వరూధినీ వివశయే నీ సౌందర్యానికి

సృష్టించాడు అపూర్వంగ నిన్ను విరించి

తలవంచాడు నీకన్న అందాలను సృజించడం మరచి


2.కవుల కలల సుందరివే నీవు

చిత్రకారుల కైనా సవాలువే నీవు

నిను చెక్కగ శిల్పి ఒకడు ఇలలో లేడు

నీతోడు కోరుకోకున్న మనిషే కాడు

సృష్టించాడు అపూర్వంగ నిన్ను విరించి

తలవంచాడు నీకన్న అందాలను సృజించడం మరచి

No comments: