రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రక్తసంబంధమేనా ఇలలో అనుబంధము
మానవీయ బంధమే కదా బంధాలకెల్ల అందము
మందికొరకు పిలుచుకుంటె ఆలంబనమవుతాయా
వావి వరుసలే చెలియలి కట్టను కడతాయా
ప్రతివారిని ప్రేమించే హృదయం చాలదా
బూటకాల నాటకాల వంతెనౌ బంధం కూలదా
1.పైనపటారం లోనలొటారం మోసపు ముసుగులు
ఈర్ష్యాద్వేషాలతో మనిషి మనిషిలో లొసుగులు
దాచుకున్న కత్తులతో వెన్నుపోటు ఆలింగనాలు
అవకాశవాదంతో ఎదుటివాణ్ణితొక్కి ఎక్కు అందలాలు
ప్రతివారిని ప్రేమించే హృదయం చాలదా
బూటకాల నాటకాల వంతెనౌ బంధం కూలదా
2.చేటు లేదు శత్రువుతో మెలిగితే అప్రమత్తులమై
హానిలేది అపరిచితులమైనపుడు అనిమిత్తులమై
పయోముఖ విషకుంభాలే చాపక్రింది బంధాలు
గోముఖ వ్యాఘ్రాలే నమ్మించి వంచించే గంధాలు
ప్రతివారిని ప్రేమించే హృదయం చాలదా
బూటకాల నాటకాల వంతెనౌ బంధం కూలదా
No comments:
Post a Comment