రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఎంతటి శిక్షనో ఈ నిరీక్షణ
నీకెప్పటికైనా చెలీ ఎరుకౌనా
ఎంతగకాల్చునో విరహ వేదన
కాసింతైనా నీకిక అవగతమౌనా
అనుభవైకవేద్యమైతేనే తెలిసేనీ తీపియాతన
సహానుభూతితోనే కరుణించాలి నువ్వికనైనా
1.కన్నయ్య రాకకు రాధ ఎలా ఎదిరి చూసిందో
దుష్యంతుని జాడకై శకుంతలెంత వేచిందో
ప్రణయాగ్ని జ్వాలలోన ఎవరెంత వేగారో
ప్రియతముల సంగమించ ఎంతగా గోలారో
అనుభవైకవేద్యమైతేనే తెలిసేనీ తీపియాతన
సహానుభూతితోనే కరుణించాలి నువ్వికనైనా
2.రామునికి దూరమై సీత ఎంత వగచిందో
నలుడి నెడబాసి దమయంతెలా సైచిందో
చేజారి పోతే తెలియును గాజు పూస రత్నమనీ
చెలికాని వెలితిని మరచుట విఫల యత్నమేననీ
అనుభవైకవేద్యమైతేనే తెలిసేనీ తీపియాతన
సహానుభూతితోనే కరుణించాలి నువ్వికనైనా
No comments:
Post a Comment