Tuesday, September 14, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చక్రవాకం


రాధగా మారితే-బాధలన్ని తీరులే

కన్నయ్యని మదిలో నిలిపితె-వెతలన్ని ఆరులే

హృదయమే బృందావని చేసి

అధరాలు వేణువుగా మలచి

తనువునే పరిచానంటే 

మనసార పిలిచానంటే

అరుదెంచుతాడు నాకై మాధవుడు-

అయితీరుతాడు తానే నా విధేయుడు


1.ముడుపు కట్టి ఉంచాను ముద్దులన్నీ

ఉగ్గబట్టి దాచాను వలపులన్నీ

సిగ్గు పడక వదిలేసాను నాకున్న బింకాలన్నీ

నిగ్గుదీర పోషించాను నావైన పొంకాలన్నీ

చూపుల విరి తూపులనే సంధించానంటే

కమ్మని బిగి కౌగిలిలో బంధించానంటే

వశమైపోతాడు నాకే మాధవుడు

అయితీరుతాడు తానే నా విధేయుడు


2.కళ్ళలో వత్తులువేసి ఎదిరి చూస్తున్నా

అలికిడి ఏమాత్రమైనా చెవులు రిక్కిస్తున్నా

అన్యధా శరణం నాస్తిగ ఆరాధిస్తున్నా

త్రికరణశుద్ధిగా సర్వదా ధ్యానిస్తున్నా

రక్తికొరకు రాకున్నా భక్తితోటి మెప్పిస్తా

వచ్చేదాక పట్టువీడక మొండిగా రప్పిస్తా

చేరదీస్తాడు తప్పక మాధవుడు

అయితీరుతాడు తానే నా విధేయుడు

No comments: