రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఆ కళ్ళు వేస్తాయి కదలనీక సంకెళ్ళు
ఆ కళ్ళు రేపుతాయి చూపులకే ఆకళ్ళు
ఆ కళ్ళే అందానికి ఆనవాళ్ళు
ఆ కళ్ళే అనురాగపు లోగిళ్ళు
వదన సరసు మీనాలై ఒప్పారును ఆ కళ్ళు
ఆనన కాననాన విహ్వలించు పసి లేళ్ళు
1.ఆ కళ్ళు అంగాలలో అనుంగు వ్యంజనాలు
ఆ కళ్ళు ముఖపుస్తక సమీక్షకే నీరాజనాలు
ఆ కళ్ళు మది గది వీక్షింపజేయు దీపికలు
ఆ కళ్ళు భావ పుష్ప సౌగంధికా వీచికలు
మోము కొలను కలువలై అలరారు ఆ కళ్ళు
లలనకు లాల నూరించెడి అల్లనేరేడు పళ్ళు
2.ఆ కళ్ళు ఒలికించు అలవోకగ నవరసాలు
ఆ కళ్ళు అచ్చతెనుగు ఇచ్చకాల సమాసాలు
ఆ కళ్ళు కురిపించును నచ్చక కడు వడగళ్ళు
ఆ కళ్ళు అతివల అలకలందు పారే సెలయేళ్ళు
కాటుక పుట్టుకకే కారణాలు ఆ సోగ కళ్ళు
సైగల భాషలో వెలయించే కైతల పుట్టిళ్ళు
No comments:
Post a Comment