Monday, May 31, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గండుకోయిలే తలదించుతుంది

నిండుగ నువు పాడుతుంటె

పారిజాతమే ఇలరాలుతుంది

పరవశాన నువు నవ్వుతుంటె

 ప్రియా గానమే ప్రాణము నీకు నాకు

కలిసి చనెడి దొక మార్గమే ఇరువురకు


1.ఇలవంక వచ్చినారు నారదతుంబురులు

నీ కడ పాటనేర్చేందుకు

నీకొరకే వెతుకుతున్నారు దేవ గంధర్వులు

నిను గురువుగ ఎంచుతూ

కఛ్ఛపి వీణియకున్న జతులు గతులు నీవి

అనాలంబ మధురిమలా నీ గాత్రపు నెత్తావి


2.తరియించగ నీగాన లహరే అల ఆకాశ గంగయై

నను పావన మొనరించు

ఎలుగెత్తిన నీ గళ రావమే కడు ఉత్తేజభరితమై

నను ఉరకలు వేయించు

సాటిరారు భువినెవ్వరు నీసరితూగ

సంగీతపు చిరునామా ఎప్పటికీ నీవవగ

No comments: