Friday, January 21, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎగిరిపోవే సిలకా ఏమాత్రం ఆలసింపకా

ఎందుకు వచ్చావో ఇలకిక నీకేమైనా ఎరుకా

ధర పంజరాన బానిసవై ఉరఃపంజరాన బంధివై

ఆర్జించినాగాని ఆంక్షలెన్నో ఖర్చుచేసినాగాని కట్టడులెన్నో

పరులకొరకు అక్కఱరాక నీకోసం నీవైనా లేకా

స్వేఛ్ఛలేని బ్రతుకెంతదాక అనుక్షణం చచ్చాక


1.మనిషిగా నిను మసలనీరు వ్యక్తిగా ఎవ్వరు గుర్తించరు

కులమతాల బురదను పూసి మానవతను మసిజేసి

కట్టుబాట్లనెన్నో అంటగడతారు ఇరుకైన చట్రాల్నే ఒంటబెడతారు

నిన్ను నిన్నుగా ఎపుడూ ఉండనివ్వరు నిశ్చింతగా రోజూ పండనివ్వరు

పరులకొరకు అక్కఱరాక నీకోసం నీవైనా లేకా

స్వేఛ్ఛలేని బ్రతుకెంతదాక అనుక్షణం చచ్చాక


2.గాలికోయే కంపలెన్నో కొంపలోన వేస్తారు

బట్టగాల్చి మీదవేసి వినోదాన్ని తిలకిస్తారు

మౌనంగాఉందామంటే ఊరుకోరు మాటల్తో ముంచేస్తే తట్టుకోరు

సంసారిగాను వేగనివ్వరు సన్యాసిగాను సాగనివ్వరు

పరులకొరకు అక్కఱరాక నీకోసం నీవైనా లేకా

స్వేఛ్ఛలేని బ్రతుకెంతదాక అనుక్షణం చచ్చాక

No comments: