Monday, January 10, 2022

https://youtu.be/Itw0hzat4Pk?si=hls1T4lvVNQhlukU

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ


"అవసాన దశ"


గొంతేమో పెగలదు కాలుచేయి కదలదు

విన్నవించుకోవడం ఎంతకూ కుదరదు

ఎవ్వరూ గ్రహించకుంటె  బాధలెలా తీరురా

నా వెత గమనించకుంటె పాలుపోని తీరురా

నీవైనా ఎరుగవా నీలకంఠేశ్వరా హరా పరా

తక్షణమే స్పందించి నా యాతన నాపరా


1.రౌరవాది నరకాల్లో ఇంత క్రౌర్యముంటుందా

యమలోకపు శిక్షలలో ఈ దైన్యముంటుందా

పిడచకట్టు నాలుకపై గుక్కెడన్ని నీళ్ళకు కరువు

లుంగచుట్టు ప్రేగులకు పట్టెడంత ముద్దే ఆదరువు

నీవైనా ఎరుగవా నీలకంఠేశ్వరా హరా పరా

తక్షణమే స్పందించి నా యాతన నాపరా


2.కఫవాత పైత్యాలు దాడిచేసె నాపై ఒకేసారి

మతిమాట చెల్లకుంది నా మేన ఆపై ప్రతిసారి

పక్కతడిపే పరిస్థితుంటే ఇంకెక్కడిది పరువు

పశుపతి నీ చలవతో అయ్యింది గుండె చెఱువు

నీవైనా ఎరుగవా నీలకంఠేశ్వరా హరా పరా

తక్షణమే స్పందించి నా యాతన నాపరా

No comments: