రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
మహనీయులు కారెవరూ మంచిమాట చెప్పినంత
ప్రవక్తలైపోరెవరూ సూక్తులు ప్రవచించినంత
ఉత్తములని పేరొందరు నీతులు వల్లించినంత
జాతినేతలైపోరు జనులను ఉసిగొలిపినంత
నమ్మిన సత్యాలను ఆచరించి చూపాలి
నిస్వార్థ త్యాగనిరతి నిరూపించ గలగాలి
వందనాలు వందనాలు మానవతావాదులకు
అభినందన చందనాలివే స్ఫూర్తి దాతలకు
1.పూలు పూయనప్పుడు పొరక మాత్రమే పూల మొక్క
తావిలేక తానౌనా పేరు గలిగినంతనే గంధపు చెక్క
వలపులు పండువేళ నోరు పండనపుడదియా ఆకువక్క
చరిత లిఖిస్తుంది నడవడి ఒరవడి కూడిన లెక్కాపక్కా
వందనాలు వందనాలు పరోపకారులందరికీ
అభినందన చందనాలు ఉదాత్త వ్యక్తులందరికి
2.ఉనికిని కోల్పోయినా కురిసి తీరుతుంది శ్రావణ మేఘం
గుర్తింపే నోచక ఆకుచాటు కోయిల ఆలపించు కమ్మని రాగం
ఇసుమంత ఆశించక పారే జీవనది తీర్చుతుంది దాహం
ఘనులెందరొ జగమందున రవిచంద్రుల చందాన అహరహం
వందనాలు వందనాలు ఆ కారణ జన్ములకు
అభినందన చందనాలు అవతార పురుషులకు
OK
No comments:
Post a Comment