Saturday, June 11, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నాకము నరకమని మరి లేవు నరునికి 

శోకము సౌఖ్యము ఏకమే నీ భక్త వరునికి

నిశ్చింతయు నీ చింతయు అపర స్వర్గ ధామము

ఆరాటము అసంతృప్తి అవనిలొ యమ లోకము

నడుపుము నను గోవిందా నీ దివ్య పథము

తిరువేంకటనాథా నిను వినా వలదే పరమ పదము


1.ఋణము తీర్చుకొనుటకే సతీ సుతుల బంధాలు

వడ్డీకి వడ్డీ వేసి గుంజుకొని నంజుకతిను చందాలు

దృష్టిని నీనుండి మరలించెడి మోహ గంధాలు

నీటి బుడగ నిలుచునంత సేపటి ఆనందాలు

నడుపుము నను గోవిందా నీ దివ్య పథము

తిరువేంకటనాథా నిను వినా వలదే పరమ పదము


2.వ్యాధులుగా బాధించును పూర్వజన్మ పాపాలు

వెంటాడి వేధించును ఆనాటి అర్భకులిచ్చిన శాపాలు

అశాంతి అలజడి వత్తిడి నిలువెల్లా దహించు తాపాలు

అడుసు త్రొక్కి జలము కోరునటుల ఈ పరితాపాలు

నడుపుము నను గోవిందా నీ దివ్య పథము

తిరువేంకటనాథా నిను వినా వలదే పరమ పదము

No comments: