నవ నారసింహం-నమామ్యహం
భవతారకనామం భజామ్యహం
అతులిత నుత మహిమాన్వితం
స్తంభ సంభవ తవ దివ్య చరితం
శరణమహం స్మరామ్యహం నరహరే దాసోహం
1. అహో మహా బలా యని
నిను సురలు మునులు కొనియాడగ కరుణబూని
వెలిసావు అహోబిలాన నవవిధ రూపమ్ములనే గొని
అగస్త్యమహాముని ప్రార్థన మన్నించి శనివారం దర్శనమీయ ప్రకటితమైనావు మాల్యాద్రిని
హిరణ్యాక్ష కుమారుని రక్తాలోచనుని దునిమి వశిష్ఠముని వినతితో నెలకొన్నావు అంతర్వేదిని
2.ఉగ్రయోగ ద్వయ మూర్తులుగా
గోదావరి నదీతీరమందున
స్థిరవాసమున్నావు ధర్మపురిన శేషప్ప వరదునిగా
పానకమే ప్రీతిగా గ్రోలుతూ
అర్పించిన సగం తిరిగి ప్రసాదిస్తూ వరలుతున్నావు మంగళ గిరిన
చెంచులక్ష్మినే మోహించి పెండ్లాడి పెనవేసి
పెనుశిలగా నిలిచావు పెంచలకోనలోన
3.యాద ఋషిని బ్రోవగా ఉగ్రయోగజ్వాలగండభేరుండ రూపాలుగా యాదగిరిన వెలుగొందేవు లక్ష్మీనరసింహునిగా
వరాహవదనము కేసరివాలము మానవ దేహము కలిగిన మూర్తిగా
చందనలేపిత రూపంగా అగుపించేవు సింహాద్రిన అప్పన్నగా
మత్స్యావతారాన సోమక సంహారాన వేదాలకు వరమిచ్చి నీసన్నిధి స్థానమిచ్చి వేదమూర్తిగా వరలేవు వేదాద్రిన
No comments:
Post a Comment