Wednesday, June 14, 2017


"దిక్కు"


ఘన సాగరాన

చిరునావలోన

సాగేను పయనం

ఏ దిక్కు లేక


తీరాన్ని చేరే దెలా

కడగండ్లు తీరేదెలా


కనుచూపు మేర

గాఢాంధకారం

ముంచెత్తివేసే

వడగళ్ళ వర్షం


ఉవ్వెతునెగసే

ఉత్తుంగ కెరటం

గొంతారి పోయే

విపరీత దాహం


తీరాన్ని చేరేదెలా

కడగండ్లు తీరేదెలా



చుక్కాని సైతం

చేజారి పోయే

తెరచాప కూడ

చిరిగింది నేడే


నడిపించు వాడు

నను వీడినాడు

ఏకాకినను చేసి

వదిలేసినాడు


తీరాన్ని చేరేదెలా

కడగండ్లు తీరేదెలా



గుండెలోని ఆశే

ఒక దారి చూపు

జడివాన నీరే

గొతింక తడుపు


నాచేతులే ఇంక

నానావ నడుపు

నన్నొడ్డు చేర్చు

తొలిపొద్దు పొడుపు


విశ్వాసమే చెలికాడు ఎపుడు

నేనే కదానాకు కడదాక తోడు

No comments: