Wednesday, August 8, 2018

ముడుచుకోకు సోదరా
గుప్పిటినిక విప్పరా
బావిలోనికప్పకున్న
భ్రాంతినీకు ముప్పురా
విచ్చుకున్న మొగ్గలాగ
పరిమళాలు గుప్పరా

1.కలచివేయు బాధలున్నా
నీలొనీవె కుమిలి పోకు
వెతలు పంచుకోకనీవు
సతమతమై చింతించకు
చేయిసాచు చెలిమికెపుడు
తివాచీలు పరచిఉంచు
నువు నమ్మిన నేస్తాలకు
మదిగదినిక తెరచిఉంచు

2.అత్తిపత్తి ఆకులాగ
ముట్టుకుంటె జడుసుకోకు
తాకబోతె నత్తలాగ
గుల్లలోకి జారుకోకు
నీటబడిన చమురు తీరు
పాత్రనంత విస్తరించు
వామనుడి అడుగురీతి
భూనభముల నాక్రమించు

3.పారదర్శకత ఎప్పుడు
జటిలము కాబోదురా
స్పష్టమైన వ్యక్తీకరణ
చిక్కులు తేబోదురా
సమాచారలోపమే
సమస్యలకు మూలమురా
సకాలాన స్పందిస్తే
విపత్తులైనా తేలికరా


No comments: