Saturday, August 11, 2018

గడ్డిపూవైతెనేమి భక్తితో పూజిస్తే
రేగుపండైతె నేమి శ్రద్ధగా నివేదిస్తె
పిడికెడటుకులైన చాలు ప్రీతిగా బహుకరిస్తె
తులసీదళమైతె నేమి విశ్వసించి కొలిస్తే

భౌతికమేదైనా భావనయే ప్రధానం
ఎద నెప్పుడు చేయాలి స్వామి సన్నిధానం

1.సతతము స్మరియించే హృదయ పీఠాలు
స్వామి అధిష్ఠించే పసిడిసింహాసనాలు
దర్శించగ ధారలుగా ఆనంద భాష్పాలు
స్వామికి అందించే అర్ఘ్యపాద్యసలిలాలు

భౌతికమేదైనా భావనయే ప్రధానం
ఎదనెప్పుడు చేయాలి స్వామి సన్నిధానం

2.తీయని పలుకుల స్తవనమైతె చాలు
స్వామిని అభిషేకించే తేనియలు పాలు
ధ్యానమందు ప్రజ్వలించు ఉచ్వాసనిశ్వాసలు
ప్రభుని ఎదుట వెలిగించే ధూపదీపాలు

భౌతికమేదైనా భావనయే ప్రధానం
ఎదనెప్పుడు చేయాలి స్వామి సన్నిధానం

3.నయనాలు కలువలు కరములు కమలాలు
స్వామి అలంకరణకై పూవులూ మాలలు
అనవరతము సోహమై ప్రభవించే ఆత్మజ్యోతి
పరమాత్మకు అర్పించే కర్పూర హారతి

భౌతికమేదైనా భావనయే ప్రధానం
ఎదనెప్పుడు చేయాలి స్వామి సన్నిధానం



No comments: