Thursday, May 9, 2019


నా పలుకుల్లో సుధలొలికే జనని
నా కవితల్లో ప్రభవించే తల్లీ
నా పాటకే ప్రాణమైన మాతా
ఏజన్మలోని పుణ్య ఫలమో
ఏకర్మలోని దివ్య బలమో
నన్నాదరించితివే సరస్వతి
నను అక్కునజేర్చుకుంటివే వాణి
ఎలానిన్ను కీర్తించనూ ఏ వరములనర్థించనూ
నమోనమో భారతీ నమోస్తుతే భగవతీ

1.చదువలేదు ఏనాడు ప్రాచ్యకళాశాలలో
పట్టాలు పొందలేదు సాహిత్య శాస్త్రములో
ఛందస్సు వ్యాకరణం చెలగి నేర్వనేలేదు
భాష పట్ల బహువిధముల కృషి సల్పలేదు

ఏ తొలి ఉషస్సులో నీ దృక్కులు ప్రసరించెనో
ఏ శుభ ఘడియలో నీ వాక్కులు ఫలియించెనో

నను కరుణించితివే వేదమయీ
నను దయజూసితివే నాదమయీ
ఎలానిన్ను కీర్తించనూ ఏవరములనర్థించనూ
నమోనమో భారతీ నమోస్తుతే భగవతీ

2.స్వరముల సంగతే ఎరిగింది లేదు
శృతిలయ సూత్రాలు తెలియగలేదు
రాగతాళాలను సాధన చేయలేదు
వాగ్గేయకారుల కృతులను వినలేదు

అమ్మలాలి పాటలోని హాయి ఎదను కదిపిందో
కోయిల గొంతులోని మధురిమ నను కుదిపిందో

నను కృపజూసితివే పాట పల్లవింపజేసి
నా తలనిమిరితివే మనోధర్మ రీతిగఱపి
ఎలానిన్ను కీర్తించనూ ఏవరములనర్థించనూ
నమోనమో భారతీ నమోస్తుతే భగవతీ

No comments: