Thursday, May 9, 2019


అమ్మ అనే మాట ఎంత విలువైనది
అమ్మ ఉన్నచోటి బ్రతుకు సులువైనది
అమ్మ ఎడద ఎంతటి విశాలమైనది
జనమంతా బిడ్డలుగా భావించగలుగునంతటిది
అమ్మంటే అనురాగమూర్తిరా
ప్రేమపంచడానికి అమ్మనే స్ఫూర్తిరా

1.ఆకలేసినప్పుడల్లా అమ్మతలపుకొస్తుంది
దిక్కుతోచనప్పుడల్లా అమ్మగురుతుకొస్తుంది
దెబ్బతాకినప్పుడూ అమ్మాఅని అరిచేము
నొప్పితాళనప్పుడూ అమ్మనే పిలిచేము
అమ్మంటే ఆదుకొనే ఆత్మబంధువు
అమ్మంటే  అంతేలేని అమృత సింధువు

2.చందమామనైనా నేలకు దింపుతుంది
గోరుముద్దలోనా మమత కలిపిపెడుతుంది
కథలెన్నొచెప్పుతూ బ్రతుకు బోధచేస్తుంది
హాయిగొలుపు జోలపాడి నిదురపుచ్చుతుంది
అమ్మ పేగు పంచుకొన్న బంధమురా
సకలజీవరాశుల్లో అమ్మ అద్భుతమ్మురా

3.రాసి రాసి కలం సిరా ఇంకిపోయినా
గుట్టలుగా పుస్తకాల రాశి మారినా
సృష్టిలోని ఘనకవులే ప్రతిభచూపినా
అమ్మ కవన వస్తువుగా అసంపూర్ణమే
అమ్మంటే కమ్మనైన భావనరా
అమ్మంటే దివ్యమైన దీవెనరా

No comments: