Tuesday, August 6, 2019

ఖని ఆమె హైమ కన వరం-
ఇదిమన తెలంగాణ జిల్లాల వివరం
కొత్తదేది మనలో చేరే అక్కరలేదు-
ఉన్న ఈ పదింటిని వదిలే ప్రసక్తిలేదు

1. గోదావరి ప్రాణహితలు మన జలనిధులు
మానేరు శ్రీరాంసాగర్ మన ప్రాజెక్టులు
ప్రత్తివరిపసుపుచెఱకు మనకు పసిడి పంటలు
కొదవలేదు మనకెప్పుడు పాడీపశుసంపదలు

2. సింగరేణి గనులు తెలంగాణ శిరోమణులు
ఎంత తోడినా తరగవు బంకమన్ను నిల్వలు
ఎన్టీపీసి థర్మల్ యునిట్ విద్యుత్ ప్రదాతలు
పేపర్ జిన్నింగ్ రైస్ మిల్సు మనపారి శ్రామికతలు

3. భేషజాలుఎరుగని మాండలీక తెలుగు మనది
రోషాలను ప్రతిఫలించె పోరాట చరిత మనది
వేదాలకు నిలయమిది-జనపదాల కాలయమిది
బతుకమ్మాయనికోరే ఉత్తమ సంస్కృతి మనది

4. భాగవతం రచియించిన పోతన్న పల్లె మనది
శతకాలు పలికిన శేషప్ప ఊరు మనది
జ్ఞానపీఠి గెలిచిన సినారె ఖ్యాతి మనది
ప్రగతి బాట పట్టించిన పీవీజన్మ భూమి మనది

5. రామయ్య వెలిసిన భద్రాద్రి మనది
రాజన్న వెలిగేటి లెములాడ మనది
చదువులమ్మ నెలకొన్న బాసరనే మనది
నర్సన్న కొలువున్న యాదగిరి మనది-ధర్మపురి మనది


6. కొయ్యనే బొమ్మగ మలిచే నిమ్మల మనది
అగ్గిపెట్టెలోపట్టే చీర నేసే సిరిసిల్ల మనది
ఫిలిగ్రీ కళాకృతుల కరినగరం మనది
తివాచీ ప్రసిద్దమైన ఓరుగల్లు మనది

7. శీతల రంజన్ల సృష్టి ఏదులపురి మనది
ఇత్తడి ప్రతిమల స్రష్ఠ పెంబర్తి మనది
ఖద్దరు చేనేతల విఖ్యాతజగతి మనది
బిర్యానంటె నోరూరే హైద్రాబాదు మనది

8. శతావధాని కృష్ణమాచార్య కోరుట్ల మనది
అభినవ పోతన వానమమలై చెన్నూరు మనది
రంగులకల నర్సింగరావు పుట్టిన మట్టిది
కత్తివీరుడు కాంతారావును కన్నపుడమిది

9. సింహమెక్కిన శాతవాహన సామ్రాట్టు దీ నేలనె
శత్రువులకె సింహ స్వప్నం రుద్రమాంబ దీ గడ్డనే
గోల్కొండమంత్రులు అక్కన్నమాదన్నతావిదె
గోండురాజులు కోయదొరలు కొమురంభీముదీమట్టే

10. ప్రజాగాయకు డైనగద్దర్ కదం త్రొక్కె భూమిదే
తెలంగాణ ఊపిరైన కేసియార్ సిద్దిపేటఇచటే
ఉద్యమాల పులిబిడ్డ-విప్లవాల పురిటిగడ్డ
శాంతికి రతనాల వీణ-ఫిరంగియే తెలంగాణ రణాన

No comments: