Wednesday, August 7, 2019

అనుసరించు ఈ మార్గాలు-నిరసన ప్రకటనకు
పాటించు ఈ ధర్మాలు-శాంతియుత పోరుకు
అందరి గమ్యం తెలంగాణా-అంతిమ లక్ష్యం తెలంగాణా

1. లూఠీలు దహనాలు-కావు హర్షణీయాలు
రాస్తారోకొ బందులు-ముందరి కాళ్ల బంధాలు
దాడులు ధ్వంసాలెలా-సమర్థనీయాలు
ఆత్మహత్యలెప్పుడూ-తేవు పరిష్కారాలు

2. ప్రతి విధ్వంసం-ప్రజలకే బహు నష్టం
పన్నులు ధరలు-పెరిగేది సుస్పష్టం
కాకూడదెవ్వరికీ-కంటగింపు మన ఇష్టం
ఈ సంగతి మఱచి పోతె-ఎంతటి దురదృష్టం

3. సత్యాగ్రహములు-అహింసాధోరణులు
తెచ్చిపెట్టాయి-స్వేఛ్ఛాస్వాతంత్ర్యాలు
గాంధేయ వాదములు-సర్వులకామోదములు
తిరుగులేని శస్త్రాలవి-మనకు బ్రహ్మాస్త్రములు

4. నిరశన దీక్షలు-మౌనప్రకటనలు
మానవ హారాలు-నలుపురంగు ధారణలు
కలవుకలవుఎన్నెన్నో-కొంగ్రొత్త రీతులు
ఆవిష్కరించునీవు-విన్నూతన తెన్నులు

5. మన నినాదాల హోరు-దేశమంత మ్రోగాలి
గొంతులన్ని ఒక్కటవ్వ-ఢిల్లీయే వణకాలి
కదంత్రొక్కి అడుగులేయ-భూకంపం రావాలి
కోట్లమంది కోర్కె తెలంగాణయని తెలపాలి

No comments: