Monday, October 21, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:బృందావన సారంగ

నీ గుడి వైపే చూడకపోతిని
దారిన వెళ్ళినా దాటవేసి చనితిని
ఇంటిపట్టునైనా పూజించనైతిని
మాటవరుసకైనా  మది తలవకపోతిని
మా ధర్మపురి నరసింహస్వామీ
నిను వేడగ నాకున్న అర్హత ఏమి

1.పావన గౌతమిలో మేను ముంచనైతిని
దానమో ధర్మమో ఎన్నడెరుగ నైతిని
జీవజంతు జాలమందు కరుణచూపనైతిని
పదపడి ఎవరికీ సాయపడకపోతిని
ఏవిధి నను బ్రోతువు నారసింహస్వామి
నిన్నడుగగ చెల్లెడి నా మొకమేది

2.నిత్యానుష్ఠానమైన నియతి చేయనైతిని
నోరారా నీ భజనలు పాడనైతిని
సుందరమౌ నీరూపము కనుల కాంచనైతిని
నీ మహిమలు తెలుపు కథలు  విననైన వినకపోతిని
అమ్మా నాన్నలనే నీవుగ నేనమ్మితిని
అదిచాలద తనయుడిపై దయజూడగ స్వామి

No comments: