Monday, December 2, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అలంకారప్రాయమేనా నీ ఆయుధాలన్నీ
పటాటోప భయంకరమేనా నీ విలయనర్తనలన్నీ
రుద్రుడవూ వీరభద్రుడవనునవి నేతి బీరనామాలేనా
మూసుకున్న మూడోకన్ను మదనుని పాలేనా
తలుచుకుంటే శివా జరుగదా ఘోరకలికి న్యాయం
భరతావనిలో భద్రతకరువై ప్రతి కలికి  అయోమయం

1.కుముదాన్ని ఊదితే అవని వణికి ఊగదా
ఢమరునాదమొక్కటే గుండెలదరజేయదా
త్రిశూలాన్ని వాడితే పశుప్రవృత్తి మాయాదా
అనాలంబి మీటితే అనురాగం విరియదా
తలుచుకుంటే శివా జరుగదా  ఘోరకలికి న్యాయం
భరతావనిలో భద్రతకరువై ప్రతి కలికి అయోమయం

2.బుసలుకొట్టు కామాన్ని బూదిచేయవేమయా
గరళకంఠ మద్యమింక ఇల హరించవేమయా
జనులకొకటె మత్తుకలుగ భక్తి ననుగ్రహించవయా
పడతులంత పార్వతీ మాతగ తలపించవేమయా
తలుచుకుంటేశివా జరుగదా ఘోరకలికి న్యాయం
భరతావనిలో భద్రతకరువై ప్రతి కలికి అయోమయం

No comments: