రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:రేవతి
కీర్తన నాది నర్తన నీది
సాగనీ నటరాజా-కళామతల్లి పూజ
చెలరేగనీ చిదంబరేశ-నా హృదయ ఘోష
1.భూ నభోంతరాలు దద్దరిల్లగా
పదునాల్గు భువనాలు పిక్కటిల్లగా
సప్తసముద్రాలు ఉవ్వెత్తున ఎగసిపడగ
ప్రకృతి సమస్తం ప్రకంపించునట్లుగా
సాగనీ నటరాజా నీ తాండవ లీల
ప్రకటించనీ చిందంబరేశ నా ఆత్మ భాష
2.జలపాతాలే తంబూరాలై సుశ్రుతీయగా
ఎదనాదాలే మృదంగ జతులై లయకూర్చగా
సెలయేటి అలలే జలతరంగిణులై మ్రోగగా
ఆకుల గలగలలే సంతూర్ ధ్వనులై రవళించగా
సాగనీ నటరాజా నీ నాట్య కేళీ
పాడనీ చిదంబరేశ నా జీవన సరళీ
3.పంచభూతాలే ప్రేక్షకులవగా
పంచప్రాణాలే సమీక్షకులవగా
పంచాననా ప్రపంచ పరిరక్షకా
నీ పంచన చేరితిరా నను పెంచిపోషించగ
సాగనీ నటరాజ ఆనంద నృత్య హేల
చల్లారనీ చిదంబరేశ నా బ్రతుకున వెతలకీల
No comments:
Post a Comment