Tuesday, June 9, 2020


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:భీంపలాస్

అమ్మా నిన్నే నమ్ముకుంటే
వమ్ముకాదు ఆశయెన్నడు
అమ్మా నీ పంచన జేరితె
చెమ్మరాదు కంటికెప్పుడు
ముల్లోకాలకె కన్నతల్లివి
దయగల్ల తల్లివి కల్పవల్లివి

1.ఆకలి సంగతి  నీవెరుగనిదా అన్నపూర్ణాదేవి
అన్నమో రామచంద్రా అంటూ అలమటించగానేమి
ప్రపంచానికే ధాన్యాగారమై భారతావని విలసిల్లనీ
ఆకలి కేకల శోకాలు లోకాన కనుమరుగవనీ

2.విద్యలేని మనిషేలేని వసుధగా సంస్కరించు
నలందా తక్షశిలల విద్యను పునరుద్ధరించు
బ్రతుకనేర్చు బుద్ధినీ మాలో జాగృత పరచు
పరమార్థ సాధనకై మమ్ముల సన్నద్ధపరచు

3.నలత కాస్త కలతగా పరిణమించనీయకమ్మ
వాస్తవ భాగ్యమైన ఆరోగ్యము నీయవమ్మ
వికృత వింత వ్యాధుల ధర దరి రానీయకమ్మ
నీవెరుగని సత్యమేది నీకసాధ్యమేదమ్మా

No comments: