Sunday, November 22, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


జీవిస్తున్నా నేనో జీవచ్ఛవంలా

ఉండీ లేక బ్రతుకే నరకంలా

చినుకే రాలని బీడులా

చివురే వేయని మోడులా

నువు లేక నే ఎడారిలా గొంతే తడారిఇలా

పున్నమి జాబిలినే కోరే చకోరిలా


1.అనుభూతులె రాయని పుస్తకమై

నీమధురోహయె వీడని జ్ఞాపకమై

 నీతో గడిపిన సమయం వెన్నెల్లో గోదారియై

నీతో వేసిన అడుగులే పొగడపూల దారియై

కాలపు చదరంగంలో బలియైన తొలిబంటునై

అంతస్తుల వైకుంఠపాళిలో పామునోటి పావునై


2.గుడిమెట్లు నిన్నెపుడూ గుర్తేచేస్తుంటే

బడి గోడల రాతలూ చెరిగిపోకుంటే

ఎలామరచిపోగలను నీ పెదవంచు మధురిమను

ఎలా వదులుకోగలను నీ కౌగిటి ఘుమఘుమను

పదేపదే నినదిస్తుంటా నీ హృదయ నాదానిగా

మరోజన్మ ఎత్తైనా నిను చేసుకుంటా నాదానిగా

No comments: