Monday, December 21, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:హిందోళ వసంతం


శుభంకరా శివ శంకరా

శంభోహరా గంగాధరా

నమఃపార్వతీ పతయే శశిధర

జయజయ జయజయ రాజేశ్వర

జయహే కాశీ విశ్వేశ్వరా జయహే రామలింగేశ్వరా


1.చమరించిన నా నయనమ్ములలో

తరగక ఊరెను సలిల ధారలు

సంతతధారగ  అభిషేకించగ

ఎంచుకుంటివా నను పరమ శివా

సరిపోవేమో నా ఆశ్రువులని 

సందేహించకు  సాంబశివా

నా చివరి  రుధిర బిందువు సైతం

అర్పణ జేసెద నీకే రుద్రా


2.అవధరించు నను నువు ధరించగా

నా చర్మము గలదు చర్మాంబరధరా

పరవశించగా నువు వసించగా 

నా మానసమే కైలాసమాయెగా సదాశివా

నీ నాట్య వేదికగ నా చిత్తము చేకొను

తకిట తధిమియని నా మదము నణచగా

కరకమలములే సమర్పించెద  ప్రియమారగా

సరగున బ్రోవగ సన్నుతించెద మహాదేవా

No comments: