Wednesday, April 8, 2020

ఆధిపత్యం లేనపుడే అన్యోన్య దాంపత్యం
ఏ దాపరికం లేనపుడే అపురూపమౌను కాపురం
మూడు ముళ్ళే బంధించాలా ముడిపడిన మనసులుంటే
ఏడడుగులు నడిపించాలా ఏడుజన్మలు తోడుంటే
ఒకరికి ఒకరై జతకడితేనే ప్రణయం
మనసుల మధ్యన వారధియే పరిణయం

1.ఎలా ఏర్పడిపోతాయో అపరిచితమౌ బంధాలు
ఎందుకు పెనవేస్తాయో ఎరుగలేము బాంధవ్యాలు
కళ్ళుమూసి తెరిచేలోగా చిక్కుబడి పోతాము
ఎంతగా విదిలించుకున్నా తప్పుకొని రాలేము
కార్యకారణ సంబంధం ఉండితీరుతుంది
ప్రతి చర్యకు ప్రతిచర్యై ప్రేమగా మారుతుంది

2.భారతీయ వ్యవస్థలో పవిత్రమే వివాహబంధం
హైందవ తత్వంలోనే అద్భుతమీ కళ్యాణ బంధం
ఒడిదుడుకులు ఎదురైనా సర్దుబాటు చేకొంటారు
పొరపొచ్చాలెన్నున్నా దాటవేసి పోతుంటారు
సంతానం లక్ష్యంగా బ్రతుకు బండి సాగుతుంది
కుటుంబమే ఐక్యంగా గండాలు దాటుతుంది

No comments: