రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
అద్దంలో నన్ను నేను చూసుకుంటే
ప్రతిబింబం నువ్వుగా తోస్తుంటే
తలపులలో పదేపదే నువ్వే వస్తుంటే
నాలోనేనే పిచ్చిగా నవ్వుకుంటుంటే
నమ్మలేవా ఇపుడైనా నీపై ప్రేమంటే
నువ్వు మాత్రమే ఇకపై నా బ్రతుకంటే
1.వెన్నెలలో ఈదాడాలనిపిస్తుంటే
మబ్బులే అబ్బురాలై కనిపిస్తుంటే
వానలోన వెర్రిగా గెంతాలనిపిస్తుంటే
ఒంటిమీద ధ్యాసంటూ లేకపోతుంటే
ఒప్పుకోవా ఇపుడైనా నీపై ప్రేమంటే
ఒక్కమాటే ఇకపై నా నువ్వే బ్రతుకంటే
2.కొత్తగా తెగువేదో వెల్లువెత్తుతుంటే
లోకమే నీముందు లోకువైపోతుంటే
ఆకలి దప్పులు అస్తవ్యస్తమౌతుంటే
నిద్దురమాని నీపై ఎన్నో కవితలు రాస్తుంటే
అర్థమైంది పూర్తిగా ఏమిటో ప్రేమంటే
నువ్వే లేక శూన్యమే ఇకనా బ్రతుకంటే
No comments:
Post a Comment