Thursday, March 4, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అధర హాసం మధుర హాసం

కులాసాల బాసకే విలాసం

హాస్యానికి స్పందించే మోవి లాసం

ఓష్ఠాకాశం వర్షించే మౌక్తిక హర్షం

మోము సీమ పల్వల్వ కనుమ చంద్రవంక

పెదవి మిథున మథన అమృతావతారిక


1.పసితనాన్ని ప్రస్ఫుటించే లేత సంతకం

తొలివలపు తెలుపుటలో మూలకారకం

నవ వధువుకు నులిసిగ్గుల సరస సాధకం

అతిథుల ఎడ ఇల్లాలి ఆహ్వాన సూచకం

వెతలకు వేసిన జలతారు మేలి ముసుగు

వదన గ్రంథానికి  ముఖచిత్రమై పొసగు


2.గోదావరి గలగలలా మంజులమై నినదించు

ప్రత్యూష శకుంతాల కువకువగా రవళించు

విచ్చీవిచ్చని విరిరేకుల పరిమళమై ప్రవహించు

ఘనాఘన ఘనతాడన పరిఘోషమై ఘోషించు

సంతూర్ వాద్య స్వన ఆహ్లాద వాదము

సుస్వర తరంగవ్యాప్త మంగళకర వేదము

No comments: