Monday, May 17, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నడిఈడు లోనా సడిచేసెనే వలపులు 

పడిలేచు అలలా మిన్నుకెగిసెనే మరులు

పురులు విప్పినాట్యమాడెనే తీపిరేపు తలపులు

కోడెనాగులై బుసలుకొట్టెనే తనివి తీరని తపనలు

ఆ నందనందనుడే ఆనందమందించనీ

నా డెందమందున్న సెగనంతమొందించనీ


1.మధించకుంటె నాడు క్షీర జలధిని

సాధించతరమయేన నిధులనీ సుధని

చిలికితేనేకదా పాలనీ ఎద మురిపాలనీ

వెలికితేగలిగేము వెన్ననీ మది వేడుకనీ

ఆ నందనందనుడే ఆనందమందించనీ

నా డెందమందున్న సెగనంతమొందించనీ


2.అణువణువున గిరిధారి కను రాధను

క్షణమైన సైచలేను నాలో విరహ బాధను

దాచి ఉంచాను మ్రోయించగా యవ్వనవీణను

రాసలీలలాడువేళ రసికతనెరపుటలో ప్రవీణను

ఆ నందనందనుడే ఆనందమందించనీ

నా డెందమందున్న సెగనంతమొందించనీ

No comments: