Thursday, May 6, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చిన్న చిన్న విషయాలకె పొంగిపోతాం

కాస్త గుర్తింపుకే సంబరపడతాం

చిన్నపాటి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే 

ఏమాత్రమైన ప్రయత్నాన్ని ప్రశంసిస్తే

అదే ఘనవిజయమనీ ఉప్పొంగుతాం

రంధ్రాన్వేషణతో నొప్పిస్తే కృంగిపోతాం

అల్పసంతోషులం కవులం-అనల్ప సంతుష్టులం

అలుపెరుగని సాహితీ సేవకులం-కవన హాలికులం


1.ఉన్నదాన్నే ఎల్లరూ ఎరిగినదాన్నే

సరికొత్తగా ఆవిష్కరిస్తాం,పరిష్కరిస్తాం

విప్పినదాన్నే ఎవరో చెప్పినదాన్నే 

మాదైన పంథాలో స్పర్శిస్తాం,సృజియిస్తాం

కర్చీఫ్ కప్పినా కాశ్మీర్ శాలువగా భావిస్తాం

చాక్లెట్ నిచ్చినా నోబెల్ బహుమతిగా ఆనందిస్తాం

అల్పసంతోషులం కవులం-అనల్ప సంతుష్టులం

అలుపెరుగని సాహితీ సేవకులం-కవన హాలికులం


2.స్పర్ధనే మాకెందుకొ సమకాలీనులంటె

ఈర్ష్యనే లోలోన మా సాటి కవులంటే

నభూతో న భవిష్యతి మాదైన కవితంటే

తప్పులెన్న తహతహనే పరుల రాతలంటే

గురువుగా భావిస్తే చేయిపట్టి నడిపిస్తాం

అగ్రతాంబూలమిస్తె ఆకసానికెత్తుతాం

అల్పసంతోషులం కవులం-అనల్ప సంతుష్టులం

అలుపెరుగని సాహితీ సేవకులం-కవన హాలికులం

No comments: