Friday, September 3, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తూరుపు తెర మీద-ఉషస్సు గీసే తైలవర్ణ చిత్రం నీదే

కృష్ణపక్ష నిశీధిలో గగనాన-మెరిసే తారలు చేసే లాస్యం నీదే

నీతోనె మలచబడినది విశ్వమంతా ఓ గులాబి బాల

నువు వినా కాంచనైతి ఈ జగాన నా ప్రియ జవరాల


1. హేమంత వేళ  పుష్పాలపై తుషార ధవళ కాంతి నీదే

వసంత వనాల పవనాలు మోసే సుమ గుభాళింపు నీదే

సెలయేటి గలగలలలో శ్రవణపేయమౌ మంజులరవం నీనవ్వే

జలపాతపు ఉరుకులలో ఉధృతమై చెలఁగే చైతన్యం నువ్వే

నీతోనె మలచబడినది విశ్వమంతా ఓ గులాబి బాల

నువు వినా కాంచనైతి ఈ జగాన నా ప్రియ జవరాల


2.అమృతాన్ని మించిన అమ్మపాలలో కమ్మదనం నీవే

నల్లనయ్య తలదాల్చిన శిఖి పింఛపు సౌకుమార్యమీవే

ఒడిదాగిన పసిపాకు కలిగే నులివెచ్చని హాయీ నీవే

తొలకరితో ఆర్తిదీర  నెర్రెల  నేల తల్లికౌ  మురిపెం నీవే

నీతోనె మలచబడినది విశ్వమంతా ఓ గులాబి బాల

నువు వినా కాంచనైతి ఈ జగాన నా ప్రియ జవరాల

No comments: