Sunday, November 7, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:రేవతి


ఈశ్వరా పరమేశ్వరా విశ్వేశ్వరా

నశ్వరమౌ ఈ దేహము పై నాకెందుల కింతటి వ్యామోహం

రామేశ్వరా రాజేశ్వరా భీమేశ్వరా

విశ్వసిస్తినిను  త్రికరణశుద్ధిగ భస్మము చేయర నాలో అహం


1.కాలకాల హే కామారి కామేశ్వరా

నలిపేయర హర బలీయమై నను కబళించే కామాన్ని

ఫాలనేత్ర ప్రభు గరళకంఠ గంగాధరా

కట్టడి సేయర అట్టుడుకుతు నా విజ్ఞత చెరిచే క్రోధాన్ని


2.మహాదేవ నమో భోలాశంకర మహేశ్వరా

నాదీ అన్నది  ఏదీలేదిట వదిలించర నా లోభాన్ని

జటాఝూట జంగమదేవర చoద్రమౌళీశ్వరా

భవబంధాలలొ బంధీనైతిని సడలించర నా మోహాన్ని


3.సాంబ సదాశివ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరా

విర్రవీగి నేగర్వించగ అణిచివేయరా నామదిలోని మదాన్ని

వైద్యనాథ జయ మల్లికార్జున త్రయంబకేశ్వరా

పరుల ఉన్నతిని భరించలేను హరించు నాలో మత్సరాన్ని

No comments: