Sunday, November 14, 2021

 రచన,స్వ కల్పన&గానం :డా.రాఖీ


చుట్టూరా గట్టే కనరాని సంద్రం

లోతెంతో అంతే తెలియని అగాథం

అనుభవాన ఛిద్రమైన వాస్తవ జీవితం

కన్నీరు తుడిచే చేయి దొరికెనా ఒక అద్భుతం

ఆశావహ దృక్పథమంటే నాకు హాస్యాస్పదం

యథాతథ స్వీకారమే చేర్చును ఆనంద పథం


1.కాళ్ళక్రింద నేలనే కంపించిపోతుంటే

గగన గండమాయే నిలువడమైనా ఉన్నచోటున

పక్కా భవంతులే కుప్పకూలిపోతుంటే

మేడలెలా కట్టగలను వింతగా గాలిలోన

ఆశావహ దృక్పథమంటే నాకు హాస్యాస్పదం

యథాతథ స్వీకారమే చేర్చును ఆనంద పథం


2.పాంథునికి ముగిసేనా పయనమెన్నడైనా

చేరాల్సిన గమ్యమన్నది మిథ్యా దిక్చక్రమైతే

తడారినగొంతే తడిసేనా ఎడారిలో బాటసారికి

ఎదురైన ఎండమావినే మంచినీరని ఎంచితే

ఆశావహ దృక్పథమంటే నాకు హాస్యాస్పదం

యథాతథ స్వీకారమే చేర్చును ఆనంద పథం

No comments: